Smuggling: ముంబై విమానాశ్రయంలో 9 కోట్ల విలువైన బంగారం, వజ్రాల పట్టివేత

- మూడు వేర్వేరు ఘటనల్లో మొత్తం 6 కేజీల బంగారం, 2,147 క్యారెట్ల వజ్రాల స్వాధీనం
- నిందితుల్లో ఒకరి అరెస్ట్
- నైరోబీ నుంచి బంగారు కడ్డీలతో వచ్చిన 14 మంది కెన్యన్లు
అక్రమంగా తరలిస్తున్న బంగారం, వజ్రాలను ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 9 కోట్ల పైమాటే. మూడు వేర్వేరు ఘటనల్లో దాదాపు 6 కేజీల బంగారం, 2,147 క్యారట్ల వజ్రాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ. 9.12 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
తొలి ఘటనలో నిందితుడు తన బెల్ట్ బకెల్, ట్రాలీ బ్యాగ్, అండర్‌వేర్‌తోపాటు ట్రాలీ బ్యాగ్‌లో పెట్టిన ల్యాప్‌ట్యాప్‌లో వజ్రాలను దాచాడని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న 2,147.20 క్యారెట్ల వజ్రాల విలువ రూ. 4,93,05,850 ఉంటుందని పేర్కొన్నారు.
మరో ఘటనలో దుబాయ్ నుంచి ముంబై చేరుకున్న ప్రయాణికుడి నుంచి 24 క్యారెట్ల ముడి బంగారం రోడియం ప్లేటెడ్ ఉంగరాలు, బటన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 775 గ్రాముల బరువున్న వీటి విలువ రూ. 61,45,347. నిందితుడు వీటిని బెల్ట్ బకెల్, ట్రాలీబ్యాగ్‌లో దాచినట్టు అధికారులు తెలిపారు.
అలాగే, ఈ నెల 12న నైరోబీ నుంచి ముంబై వచ్చిన 14 మంది కెన్యా జాతీయుల నుంచి 2,406 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.74 కోట్లు. లోదుస్తుల్లో దాచుకున్న బంగారు కడ్డీలు ఇంటర్నేషనల్ అరైవల్ హాల్‌లో కిందపడటంతో వీరి బాగోతం బయటపడింది.