Prithvi: క్షమాపణలు చెప్పిన 'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' పృథ్వీ

- 'లైలా' ప్రీ-రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యల వివాదం
- ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలన్న పృథ్వీ
- తన వల్ల సినిమా దెబ్బతినకూడదన్న పృథ్వీ
'లైలా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల సినీ కమెడియన్ పృథ్వీ క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా వేడుకలో తాను చేసిన వ్యాఖ్యల ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనకు ఎవరి పైనా కక్ష, ద్వేషం లేవని ఆయన స్పష్టం చేశారు.
తన వల్ల సినిమాకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 'బాయ్‌కాట్' లైలా అని కాకుండా 'వెల్‌కం' లైలా అని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఫలక్‌నుమాదాస్ కంటే 'లైలా' సినిమా గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విష్వక్ సేన్ కథానాయకుడిగా, రామ్ నారాయణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి.
ఈ సినిమాలో తాను మేకల సత్తి అనే పాత్రను పోషించానని, సినిమా ప్రారంభంలో 150 వరకు మేకలు ఉండేవని, సినిమా పూర్తయ్యేసరికి 11 మేకలు మాత్రమే మిగిలాయని, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందో లేదో తెలియదని ఆయన అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను బహిష్కరించాలంటూ వైసీపీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో పృథ్వీ క్షమాపణలు చెప్పారు.