Ponnam Prabhakar: రీసర్వే చేయడం లేదు, వారి కోసం పొడిగింపు: కుల గణనపై మంత్రి పొన్నం ప్రభాకర్

- కుల గణనలో చాలామంది పాల్గొనలేదన్న మంత్రి
- ఈ క్రమంలో 28 వరకు పొడిగించినట్లు స్పష్టీకరణ
- బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనాలని సూచన
తెలంగాణలో ఈ నెల 16 నుండి 28 వరకు జరిగే కుల గణన రీసర్వే కాదని, సర్వేలో పాల్గొనని వారి కోసం దీనిని నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇదివరకటి నిర్వహించిన కుల గణన సర్వేలో చాలామంది పాల్గొనలేదని, తమ సమాచారం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. సర్వేలో పాల్గొనకుండా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అగ్రనేతలు సర్వేలో పాల్గొనాలని ఆయన సూచించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ బడా వ్యాపారస్తుల పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. కుల గణన, బీసీ, ఎస్సీ వర్గీకరణ ఆ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సర్వే పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.
రాజకీయ విమర్శల కోసమే బీజేపీ నేతలు బీసీలు, ముస్లింలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం కమ్యూనిటీలోని పేదలు బీసీలోనే కొనసాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బలహీన వర్గాలపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీలో బిల్లును అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.