Hair care: హెల్మెట్‌ వల్ల జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సేఫ్!

hair care can wearing a helmet regularly cause hair fall

  • ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే హెల్మెట్ తప్పనిసరి
  • దానివల్ల తలపై చెమట పెరిగిపోయి, ఒత్తిడి పడి జుట్టు రాలిపోయే సమస్య
  • కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెంట్రుకలు రాలిపోకుండా చూసుకోవచ్చని స్పష్టం చేస్తున్న నిపుణులు

బైక్, స్కూటీ... ఏదైనా ద్విచక్ర వాహనం తీసుకుని రోడ్డెక్కామా... హెల్మెట్ తప్పనిసరి. ఏదో ట్రాఫిక్ చలానాలు పడతాయని కాదు. భద్రత దృష్ట్యా చూసినా హెల్మెట్ ధరించడం ఉత్తమం. అయితే... దీనివల్ల జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తూంటాయి. దీనితో కొందరు హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతుంటారు. అది ప్రమాదకరం. అయితే హెల్మెట్ ధరిస్తూ కూడా... జుట్టు రాలిపోకుండా, దెబ్బతినకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా...

ఒక కాటన్ వస్త్రం ధరించండి
హెల్మెట్ ధరించడానికి ముందే.. ఒక కాటన్ వస్త్రాన్ని తలపై కప్పుకుని, దానిపై హెల్మెట్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల హెల్మెట్ తో నేరుగా వెంట్రుకలపై పడే ఒత్తిడి, రాపిడి తగ్గుతాయని వివరిస్తున్నారు. అదే సమయంలో తలపై ఏర్పడే చెమటను ఆ కాటన్ వస్త్రం పీల్చుకుంటుందని చెబుతున్నారు. ఇలా చేస్తే వెంట్రుకలు రాలకుండా ఉంటాయని పేర్కొంటున్నారు.

జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ వద్దు...
తలస్నానం చేయడం వల్లగానీ, మరేదైనా కారణంతోగానీ జుట్టు తడిచి ఉన్నప్పుడు అలాగే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వెంట్రుకలు తెగిపోయి, రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని, జుట్టును ఆరబెట్టుకుని హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

హెల్మెట్ ను తరచూ శుభ్రం చేయండి...
మనం హెల్మెట్ ను ధరించినప్పుడు తలపై ఏర్పడే చెమట, నూనె వంటివి... హెల్మెట్ లోపలి భాగానికి అంటుకుంటాయి. దీనితో మురికిగా మారుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరుగుతాయి. దీని కారణంగా మనం జుట్టును ఎంత శుభ్రంగా చూసుకున్నా... హెల్మెట్ కారణంగా మళ్లీ బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి సోకుతాయి. వెంట్రుకలు రాలిపోవడానికి కారణమవుతాయి. హెల్మెట్ ను తరచూ శుభ్రం చేసుకుంటే ఈ సమస్యలు ఉండవు.

కుదుళ్ల వరకు శుభ్రం చేసుకోండి
హెల్మెట్ ధరించినప్పుడు తలపై చెమట ఏర్పడటం సాధారణమే. తరచూ హెల్మెట్ పెట్టుకుని ఎక్కువ దూరాలు, లేదా ఎక్కువ సమయం ప్రయాణించేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తరచూ తలస్నానం చేయడమేకాదు.. వెంట్రుకల కుదుళ్ల నుంచీ మురికి పోయేలా మర్దన చేసుకుంటూ, తగిన షాంపూ వాడుతూ ఉండాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది.

మంచి కండిషనర్, ఆయిల్ వాడండి
వెంట్రుకలకు మంచి కండిషనర్ లేదా హెయిర్ ఆయిల్ వినియోగించాలి. దీనివల్ల వెంట్రుకల కుదుళ్ల నుంచీ తేమ అందుతుంది. వెంట్రుకలు ఎండిపోయి, పెళుసుబారి తెగిపోవడం వంటి సమస్యలను తగ్గించవచ్చు.

  • Loading...

More Telugu News