Venice: పర్యాటకుల తాకిడి తట్టుకోలేక పన్నులు పెంచిన వెనిస్

Venice Hikes Tourist Tax In Bid To Curb Overcrowding

  • ఏప్రిల్ నుంచి 4 నెలల పాటు పెరగనున్న రద్దీ
  • నగరంలోకి ప్రవేశించాలంటే పాస్ తప్పనిసరి
  • చెక్ పాయింట్లు పెట్టి పాస్ లేని పర్యాటకులకు ఫైన్ విధిస్తున్న అధికారులు

దేశవిదేశాల నుంచి పర్యాటకులు తమ నగరానికి రావాలని కోరుకోవడం సహజం.. కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇటలీ నగరం వెనిస్ మాత్రం పర్యాటకుల తాకిడి తట్టుకోలేకపోతున్నామని వాపోతోంది. రద్దీని నియంత్రించడానికి ప్రత్యేకంగా పన్ను విధిస్తోంది. గతేడాది ఈ స్పెషల్ టాక్స్ ను అమలులోకి తీసుకురాగా ఈ ఏడాది టాక్స్ మరింత పెంచింది. వెనిస్ లోకి పర్యాటకులు ప్రవేశించాలంటే ప్రత్యేకంగా పాస్ తీసుకోవాలని కిందటేడాది రూల్ తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి జులై వరకు వెనిస్ నగరం పర్యటనకు అనుకూలం.. ఈ సీజన్ లో పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో రాబోయే సీజన్ కు వెనిస్ అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది.

టూరిస్టుల రద్దీని నియంత్రించడానికి పన్నులు పెంచింది. నగరంలో అడుగుపెట్టడానికి గతంలో రోజుకు 5 యూరోలు (మన కరెన్సీలో రూ. 453) చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉండగా ఈ ఏడాది దీనిని 10 యూరోల (రూ. 906)కు పెంచింది. అయితే, పర్యటనకు కేవలం నాలుగు రోజుల ముందు పాస్ తీసుకునే పర్యాటకులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని, అంతకంటే ముందు తీసుకుంటే 5 యూరోలే వసూలు చేస్తామని చెప్పింది. ఈ పాస్ తీసుకున్న పర్యాటకులు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెనిస్ లో విహరించవచ్చని పేర్కొంది. పాస్ తీసుకోకుండా నగరంలోకి ప్రవేశిస్తే భారీగా ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. 

నగరంలో ఏర్పాటు చేసిన వివిధ చెక్ పాయింట్లలో పర్యాటకుల పాస్ లు తనిఖీ చేస్తామని, పాస్ లేకుండా పట్టుబడిన వారి నుంచి 50 యూరోల నుంచి 300 యూరోల వరకు జరిమానా వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. వెనిస్ కు పర్యాటకులు పోటెత్తుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక యంత్రాంగం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పర్యాటకుల రద్దీని నియంత్రించడానికి పన్నులు పెంచినట్లు వివరణ ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పన్నుల పెంపు ద్వారా టూరిస్టుల రద్దీని తగ్గించడం సాధ్యం కాదని, ఆదాయం పెంచుకోవడానికే ఉపయోగపడుతుందని మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News