Business News: లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి మార్కెట్లు.. మదుపర్ల చూపంతా మోదీ అమెరికా పర్యటనపైనే!

- మార్కెట్ ప్రారంభంలో 11 శాతం లాభాలతో బీఎస్సీ సెన్సెక్స్, నిఫ్టీ 50
- ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- లాభాల్లో ట్రేడ్ అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సెర్వ్, జొమాటో
- నష్టాల్లో ఊగిసలాడుతున్న టెక్ మహీంద్రా, టైటాన్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు
మదుపర్ల సంపద వరుసగా ఆవిరి అవుతున్న వేళ గురువారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ వెంటనే యథావిధిగా నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 76,200 పాయింట్లు, నిఫ్టీ50 23,100 పాయింట్లతో మార్కెట్ ప్రారంభమైంది. ఉదయం 9.17 గంటలకు బీఎస్సీ సెన్సెక్స్ 76,258.00 వద్ద ట్రేడవుతూ 87 పాయింట్లు (0.11 శాతం) పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ 50.. 23,071.10తో ట్రేడ్ అయి 26 పాయింట్లు (0.11 శాతం) పైకి ఎగబాకింది.
అయితే, 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 75,142 వద్ద, 20 పాయింట్లు తగ్గి నిఫ్టీ 23,024 వద్ద ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్లు నిన్న కూడా ఒడిదొడుకులకు గురయ్యాయి. ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టీ దాదాపు 250 పాయింట్లు రికవర్ అయింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో మదుపర్ల చూపంతా ఇప్పుడు అటువైపే ఉంది. కీలకమైన వ్యూహాత్మక విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉండటంతో మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ట్రంప్ వాణిజ్య యుద్ధ భయాలతో ఇటీవల నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు కొన్ని రోజులపాటు అందులోనే ఊగిసలాడాయి.
సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సెర్వ్, అదానీ పోర్ట్స్, జొమాటో, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.