NDA: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 300 పైచిలుకు సీట్లు.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడి

- బీజేపీ సొంతంగా 281 సీట్లు, కాంగ్రెస్ కు 78 సీట్లే, ఇతరులకు 184 వస్తాయని అంచనా
- జనవరి 2 నుంచి ఫిబ్రవరి 10 వరకు సర్వే
- లక్ష మందికి పైగా ప్రశ్నించి అభిప్రాయ సేకరణ
దేశంలో నరేంద్ర మోదీ హవా మళ్లీ పెరుగుతోందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్ సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 343 పైచిలుకు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇందులో బీజేపీ సొంతంగా 281 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 78 సీట్లకే పరిమితమవుతుందని చెప్పింది. ఈమేరకు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేశవ్యాప్తంగా 1,25,123 మందిని ప్రశ్నించి, వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.
2024 లోక్ సభ ఎన్నికల్లో 400 కే పార్ అంటూ మోదీ పిలుపునివ్వగా 292 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే గెలిచింది. అయితే, ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత ప్రస్తుతం బీజేపీ గణనీయంగా పుంజుకుందని, ఎన్డీయే కూటమికి ప్రజాధరణ పెరిగిందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీ క్యాడర్ లో జోష్ పెంచిందని తెలిపింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 343 సీట్లలో విజయ ఢంకా మోగిస్తుందని చెప్పింది. 232 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి ప్రస్తుతం 188 సీట్లను దక్కించుకుంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరుగుతుండగా కాంగ్రెస్ ప్రాభవం పడిపోతోందని, ఓట్ షేర్ ఏకంగా 20 శాతం పడిపోతుందని తెలిపింది.