Leopard: పెళ్లికి వచ్చిన చిరుత.. భయంతో పరుగులుపెట్టిన అతిథులు.. వీడియో ఇదిగో!

- ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘటన
- పెళ్లి మండపంలో నక్కిన చిరుతను చూసి భయంతో హడలిపోయిన అతిథులు
- 200 నిమిషాలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
- చిరుత దాడిలో అటవీ అధికారికి గాయాలు
వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో తీరిగ్గా విశ్రాంతి తీసుకున్న చిరుతను చూసిన అతిథులు భయంతో హడలిపోయారు. దీంతో ఎంతో వేడుకగా జరుగుతున్న వేడుక కాస్తా రసాభాసగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న కాన్పూరు అటవీ అధికారులు ఇద్దరు పశువైద్యులతో కలిసి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 200 నిమిషాలపాటు జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం చిరుతను వలలో బంధించి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చిరుత భయంతో వాయిదా పడిన పెళ్లి తంతు ఆ తర్వాత కొనసాగింది. అటవీ అధికారులు, పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. 80-90 కేజీల బరువున్న ఈ చిరుత ఖేరి అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి ఇటు వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు తెలిపారు. చిరుతను బంధించి తీసుకెళ్లిన అధికారులు అనంతరం దానిని సఫారీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కాగా, చిరుతను బంధించే క్రమంలో ఒక అధికారిపై చిరుత దాడి చేయడంతో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయమైంది.