Shikhar Dhawan: ఆ పని జరిగే వరకు పాక్‌లో క్రికెట్ ఆడేదే లేదు.. తేల్చేసిన శిఖర్ ధవన్

- చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనున్న భారత జట్టు
- పాక్‌లో క్రికెట్ ఆడకూడదన్న నిర్ణయం సరైందేనన్న శిఖర్ ధవన్
- క్రికెట్ కంటే దేశ భద్రతే ముఖ్యమని వ్యాఖ్య
- పాక్‌లో ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఆ దేశంలో క్రికెట్ ఆడకూడదన్న ధవన్
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో పర్యటించడాన్ని భారత జట్టు ఎప్పుడో రద్దు చేసుకుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పాక్ వెళ్లి ఆడేందుకు భారత్ నిరాకరిస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ వచ్చేవారం ప్రారంభం కానుంది. అవసరమైతే టోర్నీ నుంచి వైదొలగేందుకు కూడా సిద్ధపడిన భారత జట్టు పాక్ వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. దీంతో భారత్‌తో జరిగే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌లో పర్యటించకూడదన్న బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించాడు. క్రికెట్ కంటే దేశ భద్రతే ముఖ్యమని స్పష్టం చేశాడు. ‘పాకిస్థాన్‌లో భారత జట్టు ఆడాలని మీరు అనుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు.. ధవన్ మాట్లాడుతూ.. అలా అనుకోవడం లేదని, దేశ వైఖరికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లకూడదని పేర్కొన్నాడు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడకూడదని ‘ఏఎన్ఐ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధవన్ స్పష్టం చేశాడు.
తొలుత ప్రభుత్వాలు ఒక మాటపై ఉండాలని, ఆ తర్వాత అది క్రికెట్ బోర్డుకు వర్తిస్తుందని ధవన్ పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆటగాళ్లకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదన్నాడు. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడకూడదని దేశం నిర్ణయిస్తే దానికి తాము కట్టుబడి ఉంటామని వివరించాడు.
కాగా, అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ధవన్ 167 వన్డేలు ఆడాడు. 44.1 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 34 టెస్టుల్లో 40.6 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక, 68 టీ20లు ఆడిన ధవన్ 27.9 సగటు, 11 అర్ధ సెంచరీలతో 1,759 పరుగులు చేశాడు.