Team Pakistan: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లతో పాక్ ప్లేయర్ల అనుచిత ప్రవర్తన.. వీడియో ఇదిగో!

- ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నిన్న సౌతాఫ్రికాతో మ్యాచ్
- కావాలని సౌతాఫ్రికా ప్లేయర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన పాక్ ఆటగాళ్లు
- భారీ స్కోరును ఛేదించి ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు తిరుగులేని ఫామ్ సంతరించుకున్న పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తన ప్రవర్తనతో విమర్శలు కొని తెచ్చుకుంది. ‘జెంటిల్‌మన్ గేమ్’లో పాక్ ఆటగాళ్లు అత్యంత అనుచితంగా ప్రవర్తించారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నిన్న కరాచీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్లకు పని చెప్పారు.
సఫారీలు నిర్దేశించిన 353 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (122), సల్మాన్ అఘా (134) శతకాలు బాదారు. రేపు (శుక్రవారం) జరగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత సఫారీ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్‌కేతో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది వాగ్వివాదానికి దిగాడు. షహీన్ సంధించిన బంతిని ఆడి పరుగు తీస్తున్న మ్యాథ్యూని షహీన్ కావాలని పిచ్ మధ్యలోకి వెళ్లి అడ్డంగా నిల్చుని ఢీకొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ తెంబా బవుమా రనౌట్ అయ్యాక సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్ ఇద్దరూ అతడికి దగ్గరగా వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో కల్పించుకున్న అంపైర్లు పాక్ కెప్టెన్ రిజ్వాన్‌తో చర్చించడం కనిపించింది.