Ragging: కేరళలో ర్యాగింగ్ పేరుతో దారుణం.. జూనియర్లకు నరకం చూపించిన సీనియర్లు

- ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులపై సీనియర్ల పైశాచికం
- మర్మాంగాలకు డంబెల్స్ కట్టి.. పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు
- మద్యానికి బానిసై డబ్బుల కోసం డిమాండ్
- కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఘటన
- నిందితులు ఐదుగురినీ అరెస్ట్ చేసిన పోలీసులు
ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. ఏకంగా మూడు నెలలపాటు కొనసాగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన ఈ రాక్షస చర్య సర్వత్ర చర్చనీయాంశమైంది.
కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. వారిని నగ్నంగా నిలబెట్టి, వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా కంపాస్‌లోని పదునైన పరికరాలను గుచ్చి గాయపర్చారు. ఇలా మూడు నెలలపాటు సాగిందీ దమనకాండ. గాయాలైన మర్మాంగాలకు బాధితులు లోషన్ పూసుకుంటే, విషయం తెలిసిన సీనియర్లు మరింతగా చెలరేగిపోయారు. ఆ లోషన్‌ను వారి నుంచి బలవంతంగా లాక్కుని దానిని వారి నోట్లో పిండారు. అంతేకాదు, ప్రతిదానిని వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటపెడితే అకడమిక్ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
మద్యానికి బానిసలైన నిందితులు జూనియర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. దీంతో వారి చేష్టలు భరించలేని ఓ విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి సీనియర్ల వేధింపులు గురించి చెప్పాడు. అది విన్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. దీంతో బాధితులు ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుడు నవంబర్ నుంచి సీనియర్లు తమను వేధిస్తున్నారని చెబుతూ తమ బాధలను ఏకరవు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు శామ్యూల్, జాన్సన్, జీవా, రాహుల్ రాజ్, రిజిల్ జీత్, వివేక్‌లపై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.