Mallikarjun Kharge: మోదీ 'క్లోజ్ ఫ్రెండ్' మనవాళ్లను బానిసల్లా చూస్తున్నాడు: ఖర్గే

- ఇటీవల అక్రమ వలసదారులను భారత్ తిప్పిపంపిన అమెరికా
- ట్రంప్ తన 'క్లోజ్ ఫ్రెండ్' అని మోదీ చెప్పుకుంటున్నారన్న ఖర్గే
- అందుకే రవాణా విమానంలో పంపించారంటూ ఎద్దేవా
- భారత్ సొంత విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్
అక్రమ వలసదారుల పేరిట అనేకమంది భారతీయులను అమెరికా ప్రభుత్వం సైనిక విమానంలో తిప్పిపంపడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు 'క్లోజ్ ఫ్రెండ్' అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారని, కానీ మోదీ 'క్లోజ్ ఫ్రెండ్' మనవాళ్లను బానిసల్లా చూస్తున్నాడని విమర్శించారు.
అమెరికా నుంచి తిప్పి పంపిస్తున్న వారి పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిని తీసుకువచ్చేందుకు భారత్ సొంత విమానం ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ఈ అంశంపై ట్రంప్ తో మాట్లాడాలని అన్నారు. అమెరికా మనకు మిత్ర దేశం... నేను ఏ అంశాన్నయినా పరిష్కరించగలను అని చెప్పుకుంటున్న మోదీ... ఇప్పుడీ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు.
మోదీ మాట ట్రంప్ వినేట్టయితే మనవాళ్లను ప్రయాణికుల విమానంలో కాకుండా ఇలా రవాణా విమానంలో ఎందుకు పంపించారని ఖర్గే ప్రశ్నించారు.