India vs England: శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్... ఇంగ్లండ్ ముందు కొండంత టార్గెట్

- అహ్మదాబాద్ లో భారత్ X ఇంగ్లండ్
- నిర్ణీత 50 ఓవర్లలో 356 రన్స్ చేసిన భారత్
- ఇంగ్లీష్ జట్టు ముందు 357 పరుగుల భారీ లక్ష్యం
- వన్డేల్లో 7వ శతకం నమోదు చేసిన గిల్
- హాఫ్ సెంచరీలతో రాణించిన కోహ్లీ (52), అయ్యర్ (78)
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 రన్స్ చేసింది. దీంతో ఇంగ్లండ్ కు 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
గిల్ 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయగా... మొత్తంగా 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతనికి వన్డేల్లో 7వ శతకం. గిల్ కు తోడుగా విరాట్ కోహ్లీ (52), శ్రేయాస్ అయ్యర్ (78) హాఫ్ సెంచరీలతో రాణించారు. కోహ్లీ, అయ్యర్ తో కలిసి గిల్ శతక భాగస్వామ్యాలు అందించడం విశేషం.
ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టగా... మార్క్ వుడ్ 2, సకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ తలో వికెట్ తీశారు.
ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేల్లో ఓడిన ఇంగ్లండ్... ఈ మ్యాచ్ లోనైనా గెలవాలని చూస్తోంది. కానీ, ఇంత భారీ టార్గెట్ ను ఛేదించడం ఇంగ్లీష్ జట్టుకు అంత సులువు కాదు.