Kamal Haasan: రాజ్యసభకు నటుడు కమల్ హాసన్?

- కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు
- నటుడిని డీఎంకే రాజ్యసభకు పంపించనుందని సమాచారం
- 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఒప్పందం కుదిరినట్లుగా వార్తలు
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌ను తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపించనున్నట్లు సమాచారం. డీఎంకే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నేడు కమల్ హాసన్ నివాసానికి రాష్ట్ర మంత్రి పీ.కే. శేఖర్ బాబు వెళ్లడంతో ఈ ప్రచారం ఊపందుకుంది.
మంత్రి శేఖర్ బాబు నాలుగు నెలల విదేశీ పర్యటన అనంతరం కమల్ హాసన్‌ను కలిశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే డీఎంకే, ఎంఎన్ఎం మధ్య ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ఈ ఏడాది జులైలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒక దానిని ఎంఎన్ఎంకు ఇచ్చేందుకు అప్పుడే అంగీకారం కుదిరిందని తెలుస్తోంది.