Pranab Mukherjee: నాలుగేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ప్రణబ్ ముఖర్జీ తనయుడు

- కాంగ్రెస్ కండువా కప్పుకున్న అభిజిత్ ముఖర్జీ
- కాంగ్రెస్ వ్యక్తి ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకే వస్తాడని వ్యాఖ్య
- కాంగ్రెస్ పార్టీని వీడటం పొరపాటే అన్న అభిజిత్ ముఖర్జీ
దివంగత ప్రణబ్ ముఖర్జీ తనయుడు, లోక్ సభ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నాలుగేళ్ల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు.
ఈ సందర్భంగా అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ, కాంగ్రెస్ వ్యక్తి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోకే తిరిగి వస్తాడని ఆయన అన్నారు. అది సహజమే అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటం పొరపాటు అని, అందుకు చింతిస్తున్నానని అన్నారు.
అభిజిత్ ముఖర్జీ రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పని చేశారు. ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్ట్రపతి అయ్యాక బెంగాల్‌లోని జాంగీపూర్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో లోక్ సభ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2019లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత అభిజిత్ ముఖర్జీ ఆ పార్టీలో చేరారు.