Shubhman Gill: శుభ్ మాన్ గిల్ సెంచరీ... మరో అరుదైన రికార్డు సొంతం

- అహ్మదాబాద్ లో మూడో వన్డే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- 34 ఓవర్లలో 2 వికెట్లకు 225 పరుగులు చేసిన టీమిండియా
- వన్డేల్లో 7వ సెంచరీ సాధించిన గిల్
- ఒక స్టేడియంలో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు
ఇంగ్లండ్ తో మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో ఫామ్ లో ఉన్న గిల్... నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాట్ ఝళిపించాడు. గిల్ 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ ఉడ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి సెంచరీ మార్కు అందుకున్న గిల్... వన్డేల్లో తన 7వ శతకం నమోదు చేశాడు.
అంతేకాదు, ఒక స్టేడియంలో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకున్నాడు. గతంలో ఈ ఫీట్ ను ఫాఫ్ డుప్లెసిస్ (వాండెరర్స్-జొహాన్నెస్ బర్గ్), డేవిడ్ వార్నర్ (అడిలైడ్ ఓవల్), బాబర్ అజామ్ (కరాచీ నేషనల్ స్టేడియం), క్వింటన్ డికాక్ (సూపర్ స్పోర్ట్ పార్క్-సెంచురియన్) నమోదు చేశారు. ఇప్పుడు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మాన్ గిల్ ఈ ఘనత సాధించాడు.
ఇక నేటి మ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 34 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 225 పరుగులు చేసింది. గిల్ 112, శ్రేయాస్ అయ్యర్ 51 పరుగులతో ఆడుతున్నారు. గిల్ స్కోరులో 14 ఫోర్లు, 3 సిక్సులు... అయ్యర్ స్కోరులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.