Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court slams poll freebie culture

  • రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలు మంచి పద్ధతి కాదన్న సుప్రీంకోర్టు
  • ఉచితాలు ఇస్తుండటంతో ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడటం లేదని వ్యాఖ్య
  • ప్రజలను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచన

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదని, వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఉచితాలపై పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని పేర్కొంది. దురదృష్టవశాత్తూ వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడింది. ఉచిత రేషన్, డబ్బులు అందుతున్నాయని... ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వాల ఉద్దేశాలు మంచివేనని, కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉందని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ పేదరిక నిర్మూలన మిషన్ ఎంత కాలం పని చేస్తుందో తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News