Pawan Kalyan: అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్

- ఈరోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేనాని
- మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శించనున్న పవన్
- కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల నిర్వహణ
- పవన్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జనసేనాని వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. కాగా, మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు. వాటిలో అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.