Deepika Padukone: అప్పుడు అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే.. దీపికా పదుకొణె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Actress Deepika Padukone Recalls Depression Battle in Pariksha Pe Charcha

  • ఈసారి వినూత్నంగా ప్రధాని మోదీ 'ప‌రీక్షా పే చ‌ర్చ' కార్య‌క్ర‌మం 
  • ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాలీవుడ్ న‌టి దీపికా పదుకొణె  
  • తాను మాన‌సిక ఆందోళ‌న‌కు గురైన రోజుల‌ను గుర్తు చేసుకున్న న‌టి
  • మాన‌సిక ఆరోగ్యంపై స్టూడెంట్స్ కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసిన దీపిక‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఏటా నిర్వ‌హించే 'ప‌రీక్షా పే చ‌ర్చ' కార్య‌క్ర‌మంలో ఈసారి బాలీవుడ్ న‌టి దీపికా పదుకొణె పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పారు. తాజాగా ఆమెకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ను ప్ర‌ధాని త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ఇందులో దీపిక ప‌లు ఆస‌క్తికర విష‌యాల‌ను పంచుకున్నారు. 

తాను మాన‌సిక ఆందోళ‌న‌కు గురైన రోజుల‌ను ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో తాను చాలా కుంగిపోయాన‌ని, అప్పుడు త‌న‌కు అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే వ‌చ్చేవ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఒత్తిడిని ఎలా జ‌యించాలి, ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌శాంతంగా ఎలా ఉండాలి, మాన‌సిక ఆరోగ్యంపై స్టూడెంట్స్ కు ఆమె ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. 

దీపికా పదుకొణె మాట్లాడుతూ... "స్కూల్ చ‌దువు నుంచి క్రీడ‌ల వైపు.. ఆ త‌ర్వాత మోడ‌లింగ్‌.. అక్క‌డి నుంచి సినిమాల వైపు.. ఇలా నా జీవితంలో చాలా మార్పులు చూశా. ఆ స‌మ‌యంలో న‌న్ను నేను మోటివేట్ చేసుకుంటూనే వ‌చ్చా. 2014 వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ, ఆ త‌ర్వాత ఒక‌సారి ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయా. అప్పుడే నేను కుంగుబాటు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది. 

నేను ముంబయిలో ఒంట‌రిగా ఉండ‌టం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ను చాలాకాలం పాటు ఎవ‌రికీ చెప్ప‌లేదు. ఒక‌సారి మా అమ్మ ముంబ‌యికి వ‌చ్చి తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో ఆమెను ప‌ట్టుకుని బాగా ఏడ్చేశా. ఆ రోజు తొలిసారి నా బాధ‌ను అమ్మ‌తో పంచుకున్నా. 'నిస్స‌హాయ స్థితిలో ఉన్నా. నాకు జీవితంపై ఆశ లేదు. బ‌త‌కాల‌ని లేదు' అని అమ్మ‌కు చెప్పా. అప్పుడు ఆమె న‌న్ను మాన‌సిక వైద్య నిపుణుడి వ‌ద్ద‌కు వెళ్ల‌మ‌ని సూచించింది" అని దీపిక ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. 

ఇక ఆందోళ‌న, ఒత్తిడి, కుంగుబాటు అనేవి ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక ద‌శ‌లో ఎదుర్కొనేవే అని ఆమె అన్నారు. వాటి గురించి భ‌య‌ప‌డొద్ద‌ని సూచించారు. పంచుకుంటేనే మ‌న‌లోని భారం త‌గ్గిపోతుంద‌ని తెలిపారు. స‌మ‌స్య‌ను దాచిపెట్టి బాధ‌ప‌డితే వ‌చ్చేది ఏమీ లేద‌ని, ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్పాల‌ని దీపిక చెప్పుకొచ్చారు.  

More Telugu News