Telugudesam: మదనపల్లె టీడీపీలో వర్గపోరు.. అధిష్ఠానం సీరియస్

- ఎమ్మెల్యే షాజహాన్, శ్రీరాం చినబాబు మధ్య విభేదాలు
- ఎమ్మెల్యేపై చినబాబు బహిరంగ విమర్శలు
- మంగళగిరి కార్యాలయానికి రావాలంటూ పార్టీ ఆదేశాలు
మదనపల్లె టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు మధ్య విభేదాలు వీధికెక్కాయి. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎదుట హాజరుకావాలని పార్టీ వీరిని ఆదేశించింది.
చాలాకాలంగా షాజహాన్ బాషా, శ్రీరాం చినబాబు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల అవి తారస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేపై శ్రీరాం చినబాబు బహిరంగంగా విమర్శలు చేయడంతో ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. గత ఎన్నికల్లో షాజహాన్ బాషాకు టీడీపీ టికెట్ అనూహ్యంగా దక్కింది. ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేతలు కలుసుకున్న సందర్భాలు లేవు. ఎమ్మెల్యే పనితీరు పట్ల హైకమాండ్ సంతృప్తిగా ఉన్నప్పటికీ... నేతలతో సమన్వయ లోపంపై అసంతృప్తిగా ఉంది. దీంతో మదనపల్లెలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించింది.