Sheldon Jackson: టీమిండియాలో అరంగేట్రం చేయకుండానే 15 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికిన స్టార్ క్రికెటర్!

- దేశవాళీ క్రికెట్ లో మంచి ప్లేయర్ గా పేరొందిన షెల్డన్ జాక్సన్
- 100కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడిననా భారత జట్టులో మాత్రం చోటు దక్కని వైనం
- 15 ఏళ్లుగా సౌరాష్ట్ర జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్న జాక్సన్
- ఐపీఎల్ లో కేకేఆర్ తరఫున 9 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్
దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్లేయర్ గా పేరొందిన సౌరాష్ట్ర బ్యాటర్ షెల్డన్ జాక్సన్ మంగళవారం తన 15 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ అతని చివరి మ్యాచ్.
గుజరాత్ చేతిలో ఓటమితో అతని చివరి మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేయగా... రెండో ఇన్నింగ్స్ లో 27 రన్స్ చేశాడు. మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి షీల్డ్ బహూకరించి సత్కరించింది.
38 ఏళ్ల జాక్సన్ 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 45 కంటే ఎక్కువ సగటుతో 7,200 కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 186. ఇలా అద్భుతమైన గణాంకాలు కలిగిన జాక్సన్ భారత జట్టులో మాత్రం అరంగేట్రం చేయలేకపోయాడు.
2011లో సౌరాష్ట్ర క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతడు 15 ఏళ్లుగా ఆ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. నమ్మకమైన బ్యాటర్ గా, ఫీల్డర్ గా రాణించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో సౌరాష్ట్ర తరఫున వికెట్ కీపర్ గా తన సేవలు అందించాడు. గత నెలలో తన పరిమిత ఓవర్ల కెరీర్ కు ముగింపు పలికాడు.
జాక్సన్ వైట్‌బాల్ క్రికెట్ లో 84 ఇన్నింగ్స్‌లలో 2,792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున 9 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించిన అతడు కేవలం 61 పరుగులే చేశాడు.