AP Minister Kollu Ravindra: ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

- పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి రవీంద్ర
- ఏ మద్యం బాటిల్‌పైనైనా ప్రభుత్వం పెంచింది రూ.10 మాత్రమేనని వెల్లడి
- 5 రెట్లు, 10 రెట్లు ధరను పెంచినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏ మద్యం బాటిల్‌పైనైనా ప్రభుత్వం పెంచింది రూ.10 మాత్రమేనని, 5 రెట్లు, 10 రెట్లు ధరను పెంచినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని, ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు.
వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి విమర్శించారు. సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యం బాటిల్ ధరను ఏకంగా రూ.200కి పెంచారని, చెత్త బ్రాండ్‌లు తీసుకొచ్చారన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను సొంత మనుషులతో విక్రయించారని ఆరోపించారు. ఇప్పుడు వీటన్నింటినీ అరికట్టామని చెప్పారు. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని పునరుద్ఘాటించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని, త్వరలో నివేదికను బయటపెడతామని మంత్రి చెప్పారు. త్వరలో మద్యం అక్రమాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే వైసీపీ నేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏడాదిలో సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో వచ్చే వారం నుంచి నవోదయం కార్యక్రమాన్ని అమలులోకి తెస్తున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు.