Jasprit Bumrah: చాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా అవుట్.. అతడి స్థానంలో యువ పేసర్‌కు చోటు

- గాయం నుంచి కోలుకున్నా సామర్థ్యం మేరకు బౌలింగ్ డౌటేనన్న వైద్య బృందం
- ఇప్పుడు ఆడిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉందని ఆందోళన
- జట్టు నుంచి బుమ్రాను తప్పించినట్టు ప్రకటించిన బీసీసీఐ
- అతడి స్థానంలో హర్షిత్ రాణాకు చోటు
- ఈ నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గత రాత్రి ప్రకటించింది. జనవరి 3-5 మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయపడిన బుమ్రా అప్పటి నుంచి విశ్రాంతిలోనే ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయాడు. వెన్ను కింది భాగంలో గాయం కారణంగా బుమ్రా ఈ టోర్నీకి దూరమైనట్టు బీసీసీఐ పేర్కొంది.
పాకిస్థాన్‌లో ఈ నెల 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా గత నెలలోనే భారత జట్టును ప్రకటించారు. ఫిట్‌గా లేకున్నా కోలుకుంటాడన్న ఉద్దేశంతో బుమ్రాకు జట్టులో చోటు కల్పించారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నా బుమ్రా కోలుకోలేకపోయాడు. ఫిట్‌నెస్ సాధించడంలో విఫలం కావడంతో జట్టు నుంచి అతడిని తప్పించారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పు చేర్పులకు నిన్ననే తుది గడువు కావడంతో బుమ్రా ఫిట్‌నెస్‌పై ఎన్‌సీఏ వైద్య బృందం బోర్డుకు తుది నివేదిక సమర్పించింది.
గాయం నుంచి బుమ్రా దాదాపు కోలుకున్నట్టేనని వైద్య బృందం పేర్కొన్నప్పటికీ సామర్థ్యం మేరకు బౌలింగ్ చేయగలడన్న హామీని ఇవ్వలేకపోయింది. కాబట్టి తుది నిర్ణయాన్ని సెలక్టర్లు, జట్టు యాజమాన్యానికి వదిలేసింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రాను ఆడిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉందని, అప్పుడు ఎక్కువ కాలం మైదానానికి దూరమయ్యే ప్రమాదం వుందని భావించిన బోర్డు జట్టు నుంచి అతడిని తప్పించాలని నిర్ణయించింది. కాగా, వచ్చే నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ నాటికి బుమ్రా ఫిట్‌నెస్ సాధించే అవకాశాలున్నాయి.