Nagarjuna: ఫోన్ దగ్గరుంటే నాగచైతన్య ముఖం ఎలా ఉంటుందో చూద్దామనుకున్నా, కానీ!: నాగార్జున

- తండేల్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న అక్కినేని నాగార్జున
- ఈ నెల 7న సినిమా విడుదలైన రోజున ప్రధానిని కలిశామన్న నాగార్జున
- సెక్యూరిటీ సిబ్బంది తమ ఫోన్లను తీసుకున్నారని వెల్లడి
తన కుమారుడు నాగచైతన్య నటించిన 'తండేల్' సినిమా ఈ నెల 7న విడుదలైందని, అదే రోజు తాము ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు వెళ్లామని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ప్రధాని వద్దకు వెళ్లినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది తమ ఫోన్లను తీసుకున్నారని, ఫోన్ దగ్గరే ఉండి ఉంటే సినిమా విజయం పట్ల వచ్చిన సందేశాలు, కాల్స్ చూసి నాగచైతన్య ముఖం ఎలా ఉంటుందో చూద్దామనుకున్నానని అన్నారు.
తాను ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చాక ఫోన్‌ను ఆన్ చేశానని, కంగ్రాట్స్ అప్పా, కంగ్రాట్స్ డాడీ అంటూ తనకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. అభిమానుల నుండి కూడా సందేశాలు వచ్చినట్లు ఆయన చెప్పారు. తండేల్ సినిమా విజయం పట్ల తమ కంటే అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతగా ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైందన్నారు. సినిమా విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈరోజు ఆయన తండేల్ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అరవింద్ కథ విన్న వేళా విశేషం, చందూని దర్శకుడిగా ఎంచుకున్న వేళా విశేషం, హీరోగా చైతన్యను ఎంపిక చేసుకున్న వేళా విశేషం, చైతన్య-శోభిత పెళ్లి వేళా విశేషం అన్నీ బాగున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్... ఇలా మూడు విజయాలను అల్లు అరవింద్ తమకు ఇచ్చారన్నారు. అల్లు-అక్కినేని కుటుంబానికి అంతా బాగా కుదిరిందన్నారు. 'తండేల్' ద్వారా నాగచైతన్యలోని మరో నటుడిని దర్శకుడు చందూ తీసుకువచ్చారని ప్రశంసించారు. చందూతో తాను సినిమాలు చేయలేదని, కానీ అతని ప్రతిభ గురించి తెలుసని నాగార్జున అన్నారు. సాయిపల్లవి డ్యాన్స్ ఎప్పుడూ బాగుంటుందన్నారు.