Sridhar Babu: అవి ప్రపంచాన్ని ఏలబోతున్నాయి: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు

- తెలంగాణలో మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటు లేదన్న మంత్రి
- ఐటీలో మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తామన్న శ్రీధర్ బాబు
- సాంకేతికత ప్రతి ఒక్కరికీ చేరాలని తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్య
- చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ప్రపంచాన్ని ఏలబోతున్నాయని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు ఎలాంటి లోటు లేదని, గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో 32వ హైసియా (హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్) సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ఐటీలో మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు.
కంపెనీలకు బెస్ట్ స్కిల్స్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతను ఇప్పటికే మనం అందిపుచ్చుకున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని అన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ పారిశ్రామిక, ఐటీ హబ్‌గా ఉందని ఆయన చెప్పారు.
సాంకేతికత ప్రతి ఒక్కరికీ చేరాలని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంతరిక్షంలో, సైన్యంలో సాంకేతికత పెరిగిందని, అందుకే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. దేశీయ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా క్రమంగా పెరుగుతోందని అన్నారు. ఐటీ రంగంలో నియామకాలు కూడా హైదరాబాద్‌లో పెరుగుతున్నట్లు చెప్పారు.
రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాముడి పేరుతో దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రంగరాజన్‌పై జరిగిన దాడిని తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.