Revanth Reddy: మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసుల మృతి... రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

8 Hyderabadis dead in Madhyapradesh accident

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి
  • అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
  • జబల్‌పూర్ కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసిన బండి సంజయ్

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

జబల్‌పూర్ కలెక్టర్‌కు బండి సంజయ్ ఫోన్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జబల్‌పూర్ కలెక్టర్‌కు ఫోన్ చేశారు. మృతులంతా హైదరాబాద్‌లోని నాచారంకు చెందిన వారని తెలియడంతో ఆయన జబల్‌పూర్ కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరారు. మృతదేహాలకు వెంటనే పంచనామా చేసి, త్వరగా స్వస్థలాలకు త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఒక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారిని అధికారులు తెలిపారు.

జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. బస్సులో ఉన్న మిగతా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సిహోరా ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన మినీ బస్సు రిజిస్ట్రేషన్ 'ఏపీ' అని ఉండటంతో తొలుత వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని భావించారు. అయితే, మృతదేహాల వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా మృతులను తెలంగాణలోని నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News