Hyderabad: పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిల్ దాఖలు

- ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఏపీడబ్ల్యూఎఫ్
- తెలంగాణ సీఎస్ సహా పలువురిని ప్రతివాదులుగా చేర్చిన వైనం
- చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి
పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీడబ్ల్యూఎఫ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులుగా పేర్కొంది. పాతబస్తీలో పలు చారిత్రక కట్టడాలు ఉన్నందున, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణ హెరిటేజ్ యాక్ట్-2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆ పిల్‌లో పేర్కొంది. పాతబస్తీ మెట్రో మార్గం సమీపంలోనే చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలీ, మొఘుల్‌పురా వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని తెలిపింది.
మెట్రో రైలు నిర్మాణం వల్ల ఈ చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే, మెట్రో రైలు డిజైన్‌ను హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని, అప్పటి వరకు మెట్రో నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ పిల్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.