China Man: గుండెపోటు బాధితుడికి సీపీఆర్ చేసి కాపాడిన ప్రయాణికులు.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి నోటి వెంట వచ్చిన మాటలకు అంతా షాక్

China Man Who Suffered Heart Attack Regains Consciousness Only To Say I Need To Rush To Work

  • అంబులెన్స్ పిలిపించిన ప్రయాణికులు
  • ఆసుపత్రికి కాదు ఆఫీసుకు వెళ్లాలనడంతో నివ్వెరపోయిన జనం
  • చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఘటన

రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. రైల్వే సిబ్బంది, ఓ వైద్యుడు వెంటనే సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి కోలుకున్నాడు. అయితే, కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలు అక్కడున్న వారిని నివ్వెరపోయేలా చేశాయి. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఈ నెల 4న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. హునాన్ ప్రావిన్స్ లోని ఛాంగ్ షా రైల్వే స్టేషన్ లో 40 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. రైలు ఎక్కేందుకు క్యూలో ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. రైల్వే స్టేషన్ సిబ్బందితో పాటు ఓ వైద్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేశారు. దీంతో కాసేపటికి ఆ ప్రయాణికుడు కోలుకున్నాడు.

నెమ్మదిగా కళ్లు తెరిచిన ఆ వ్యక్తి.. తాను వెంటనే ఆఫీసుకు వెళ్లాలని, హైస్పీడ్ ట్రైన్ అందుకోవాలని అనడంతో వైద్యుడితో పాటు చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అలాంటి పరిస్థితిలో కూడా ఆఫీసుకు వెళ్లాలనడం చూసి అక్కడున్న వారంతా కదిలిపోయారు. అతని కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. లేకుంటే ఇలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వెంటనే ఆఫీసుకు వెళ్లాలని ఎందుకంటాడు? అంటూ జాలిపడ్డారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని మొండికేసిన బాధితుడికి ప్రయాణికులు సర్దిచెప్పారు.

‘కొద్దిలో ప్రాణాపాయం తప్పింది.. ఇప్పుడు నువ్వు ఆసుపత్రికి వెళ్లాలి కానీ ఆఫీసుకు కాదు’ అంటూ బతిమిలాడి అతడిని అంబులెన్స్ ఎక్కించారు. ఈ వార్తకు సంబంధించిన క్లిప్ ను షేర్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హృదయాన్ని కదిలించేలా ఉంది. ‘ఈ సమాజంలో అతడొక్కడే కాదు.. మనలో చాలామంది అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. ఇంటి ఈఎంఐ నుంచి పిల్లల చదువు దాకా ఎన్నో బరువు బాధ్యతలతో మనలో చాలామంది నిత్యం ఒత్తిడికి గురవుతూనే ఉన్నాం. ఈ ప్రపంచంలో బతకడం అంత సులభం కాదు’ అంటూ కామెంట్ చేశాడు.

  • Loading...

More Telugu News