Flight Accident: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

- పార్క్ చేసిన విమానాన్ని ఢీ కొట్టిన ప్రైవేట్ జెట్
- అరిజోనాలోని స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్ట్ లో ఘటన
- తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు
అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పింది. పార్కింగ్ ప్లేసులో ఉన్న మరో ప్రైవేట్ జెట్ ను ఢీ కొట్టింది. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అరిజోనా రాష్ట్రంలోని స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం.. లియర్‌జెట్ 35ఏ విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. రన్‌వే దాటి ర్యాంప్‌పై ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అధికారులు స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేను క్లియర్ చేసి, విమానాల రాకపోకలకు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లియర్ జెట్ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదు.
ఇటీవల అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో 67 మంది చనిపోయారు. రెండు రోజుల తర్వాత (జనవరి 31న) ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. ఫిబ్రవరి 9న అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని పదిమంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ప్రమాదంతో గత రెండు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరగగా మొత్తం 85 మంది చనిపోయారు.