Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. కాంగ్రెస్‌తో పొత్తుకు మమత ససేమిరా

- హర్యానాలో కాంగ్రెస్‌ను, ఢిల్లీలో ‘ఆప్’ను కాంగ్రెస్ ఓడించిందన్న మమతా బెనర్జీ
- వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామన్న సీఎం
- వరుసగా నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మమత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కాంగ్రెస్ సాయం చేయలేదని, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ‘ఆప్’ సాయం చేయలేదని మమత తెలిపారు. కాబట్టి రెండు చోట్ల బీజేపీ విజయం సాధించినట్టు మమత చెప్పారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని, కానీ, బెంగాల్‌లో కాంగ్రెస్ చేసింది శూన్యమని పేర్కొన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అదే సరిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీట్లలో మూడింట రెండొంతులు గెలిచి వరుసగా నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మమత ధీమా వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
భావసారూప్యత ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు మమత ఉద్బోధించారు. లేదంటే బీజేపీని జాతీయ స్థాయిలో కట్టడి చేయడం ఇండియా కూటమికి కష్టమవుతుందని పేర్కొన్నారు. ఓటరు లిస్టులో విదేశీయుల పేర్లు చేర్చేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందని, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.