manyam bandh: మన్యంలో ప్రారంభమైన 48 గంటల నిరవధిక బంద్ .. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

- అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజన్సీలో 48 గంటల నిరవధిక బంద్
- ఉదయం నుంచే బంద్‌లో పాల్గొన్న ఆదివాసీలు, వైసీపీ, వామపక్షాలు
- బంద్ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సంస్థల మూసివేత
- ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల వాయిదా
- డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48 గంటల పాటు బంద్ కొనసాగుతోంది. 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే రోడ్డు పైకి వైసీపీ, వామపక్షాల నేతలు, ఆదివాసీ సంఘాలు వచ్చి షాపులను మూసి వేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వ్యాపార వాణిజ్య సంస్థలు, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్ నేపథ్యంలో అధికారులు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు. బంద్ ప్రభావంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన సూచనలతో ఆదివాసీ, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అయ్యన్న సూచించారు. అయితే అదే జరిగితే 1/70 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆదివాసీ, ప్రజా సంఘాల ఆందోళన. ఆదివాసీ, ప్రజా సంఘాల 48 గంటల బంద్ పిలుపుకు వైసీపీ మద్దతు ప్రకటించింది.
బంద్ ప్రభావంతో అరకు, పాడేరు ఏరియాలో పర్యాటక కేంద్రాలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. 48 గంటల బంద్ విజయవంతం కోసం అన్ని గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని వామపక్షాల నేతలు కోరారు. ప్రజలంతా బంద్ కు సహకరించాలని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై నిరసనకారులు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.