Vidadala Rajini: అట్రాసిటీ కేసులో బెయిలు కోసం హైకోర్టుకు మాజీమంత్రి విడదల రజని

- చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిల్లి కోటి ఫిర్యాదుతో కేసు నమోదు
- పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిలు ఇవ్వాలని పిటిషన్
- వాట్సాప్ ద్వారా దూషించినట్టు చెప్పడం కోర్టులో చెల్లదన్న రజని
- పిటిషనర్‌పై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయన్న మాజీ మంత్రి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు నాగిశెట్టి జయ ఫణీంద్ర, రామకృష్ణ నిన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అప్పటి టౌన్ సీఐ సూర్యనారాయణ తనను హింసించి వీడియో కాల్ ద్వారా రజనికి చూపించారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న కోటి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులు.. వాట్సాప్ కాల్ ద్వారా తనను దూషించినట్టు కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నారని, కాబట్టి ఇది చెల్లదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పిటిషనర్‌పై నాలుగు కేసులు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ కేసుల్లో తమపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ కుదుర్చుకునే ఉద్దేశంతోనే తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని రజని కోర్టుకు తెలిపారు. కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వాలని రజని తన పిటిషన్‌లో అభ్యర్థించారు.