Flood Lights Failure: టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్ లో నిలిచిపోయిన ఫ్లడ్ లైట్లు... ఒడిశా క్రికెట్ సంఘానికి నోటీసులు

- నిన్న టీమిండియా-ఇంగ్లండ్ రెండో వన్డే
- కటక్ లోని బారాబతి స్టేడియంలో నిలిచిన ఫ్లడ్ లైట్లు
- 30 నిమిషాల పాటు మ్యాచ్ కు అంతరాయం
- సీరియస్ గా పరిగణిస్తున్న ఒడిశా క్రీడల మంత్రిత్వ శాఖ
- 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఒడిశా క్రికెట్ సంఘానికి షోకాజ్ నోటీసులు
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నిన్న కటక్ లోని బారాబతి స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా, మైదానంలోని ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దాంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ అంశాన్ని ఒడిశా క్రీడల మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది.
మ్యాచ్ కు 30 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడడం పట్ల వివరణ ఇవ్వాలంటూ ఒడిశా క్రికెట్ సంఘానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా అన్ని వివరాలతో బదులివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒడిశా క్రికెట్ సంఘం నుంచి వివరణ అందాక ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఒడిశా క్రీడల మంత్రి సూర్యబన్షి సూరజ్ వెల్లడించారు.
కాగా, స్టేడియంలో లైట్లు ఆగిపోయిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర క్రీడల మంత్రి రాజీనామా చేయాలని బిజూ జనతాదళ్ (బీజేడీ) నేత లెనిన్ మొహంతి డిమాండ్ చేశారు.