G. Kishan Reddy: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడిపై స్పందించిన కిషన్ రెడ్డి

Kishan Reddy responds on attack on Rangarajan

  • రంగరాజన్ మీద దాడిని తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి
  • అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై దాడి అమానుషమని వెల్లడి
  • ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదని స్పష్టీకరణ

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ మీద దాడి ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అర్చకుడిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రంగరాజన్ ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని, అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం, బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని ఆయన అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్ దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ దాడిని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రంగరాజన్‌కు అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News