Revanth Reddy: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

- ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి
- రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన ముఖ్యమంత్రి
- దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు ఫోన్ చేశారు. రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ దాడిని రాజకీయ పార్టీలు, నాయకులు ఖండించారు. ఈ దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
అర్చకుడు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రంగరాజన్... నమస్తే సర్, నమస్తే అనగానే... ముఖ్యమంత్రి "నమస్తే అయ్యగారూ" అని పలకరించారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు చెప్పాల్సింది కదా అని ముఖ్యమంత్రి అడగగా... మీరు ఉన్నారు, పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తోందని రంగరాజన్ అన్నారు. పోలీసులు బాగా స్పందించారని కితాబునిచ్చారు.
మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేకు కూడా సూచన చేశానన్నారు. ఒకసారి వీలు చూసుకొని చిలుకూరు బాలాజీ ఆలయానికి వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సహకారం అవసరమైతే తమకు చెప్పాలని ఆయన అన్నారు.