Devendra Fadnavis: ఆ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్

- ఒక షోలో పేరెంట్స్ శృంగారంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం
- వాక్ స్వాతంత్రం ఉందని ఏది పడిదే అది మాట్లాడవద్దన్న దేవేంద్ర ఫడ్నవీస్
- చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం లేదన్న యూట్యూబర్ ఇలహాబాదియా
పేరెంట్స్ శృంగారంపై యూట్యూబర్ రణ్‌వీర్ ఇలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో, బయట విమర్శలు రావడంతో యూట్యూబర్ క్షమాపణలు చెప్పాడు. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడుతూ, తాను ఆ షోను చూడలేదని, కానీ ఆ విషయం తెలిసిందన్నారు. మనం మాట్లాడే కొన్ని విషయాలు ఒక్కోసారి సమాజంలోకి తప్పుగా వెళతాయన్నారు. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్రం ఉంటుందని, కానీ ఇతరుల వాక్ స్వేచ్ఛను హరించినప్పుడు ఆ వాక్ స్వేచ్ఛ ముగిసిపోయినట్లే అని అన్నారు. సమాజంలో మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయని, కొందరు ఆ నియమాలను ఉల్లంఘించడం తప్పు అవుతుందన్నారు. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
క్షమాపణలు చెబుతూ పోస్ట్
తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, వాటిలో ఎలాంటి హాస్యమూ లేదని రణ్‌వీర్ ఇలహాబాదియా అన్నారు. కామెడీ చేయడం తన బలం కాదని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన ఛానల్‌ను ప్రచారం చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా చాలామంది భావిస్తున్నారని, కానీ అలాంటి ఉద్దేశం తనకు లేదన్నారు. చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.