Kiran Royal-Lakshmi: కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్... అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ పోలీసులు

Rajasthan police arrests Lakshmi the woman made allegations on Kiran Royal

  • కిరణ్ రాయల్ పై ఇటీవల లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు
  • ఓ ఆన్ లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి
  • ఆమె మీడియాలో కనిపించడంతో తిరుపతి వచ్చిన రాజస్థాన్ పోలీసులు
  • అరెస్ట్ చేసి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ కు తరలింపు

జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. మరోవైపు సదరు మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో, కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉంచింది. 

ఈ క్రమంలో నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకుని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆన్ లైన్ చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ఆన్ లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నట్టు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అంతకుముందు, ఈ ఉదయం లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి కిరణ్ రాయల్ పై ధ్వజమెత్తింది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని... తనకు ఎవరూ తెలియదని చెప్పింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ తన పరిస్థితి పట్ల స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. 

పదేళ్ల కిందటే డబ్బు వ్యవహారం సమసిపోయిందని కిరణ్ రాయల్ చెబుతున్నాడని... మరి రెండేళ్ల కింద బాండ్ ఎందుకు రాసిచ్చినట్టు? అని లక్ష్మి ప్రశ్నించింది. జనసేన అధికారంలో ఉండడంతో ఈ విషయంలో కిరణ్ రాయల్ ను ఎవరూ నిలదీసి అడగడంలేదని, ఒక మహిళకు ఇంతటి అన్యాయం జరుగుతుంటే ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించింది. 

కిరణ్ రాయల్, ఇతరులు తన పట్ల దారుణంగా మాట్లాడుతున్నారని వెల్లడించింది. తనకు, తన పిల్లలకు కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉందని లక్ష్మి ఆరోపించింది. ఒకవేళ తాను చనిపోయినా, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. 

అతడు మరో మహిళను ఇంట్లోకి వెళ్లి మరీ కొట్టాడని, ఆ మహిళ ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పుకోలేక, తనకు ఫోన్ చేసి చెప్పుకుందని లక్ష్మి వివరించింది. కిరణ్ రాయల్ ఒక నీచుడని, అతడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని పేర్కొంది.

  • Loading...

More Telugu News