KTR: దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిని పరామర్శించిన కేటీఆర్

KTR went to Chilukuri Balaji priest Rangarajan residence

  • రంగరాజన్ పై దాడికి పాల్పడిన కొందరు వ్యక్తులు
  • బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ ను పరామర్శించిన కేటీఆర్
  • దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగరాజన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ తదితరులతో కలిసి రంగరాజన్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రంగరాజన్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ అజెండాతో ఈ దారుణానికి ఒడిగట్టినా... వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. 

భగవంతుడి సేవలో ఉండే రంగరాజన్ కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే... రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. స్వామివారి సేవలో ఉండే కుటుంబాన్ని అవమానించడమంటే... దేవుడిని అవమానించినట్టేనని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని అన్నారు. 

  • Loading...

More Telugu News