Jay Shah: ఇంట్రెస్టింగ్ థీమ్‌తో మూడో వ‌న్డే.. ఐసీసీ ఛైర్మ‌న్ జై షా కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ICC Chairman Jay Shah Announces New Awareness Initiative Ahead Of Ind Vs Eng 3rd ODI

  • ఎల్లుండి అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్ మూడో వ‌న్డే
  • 'అవ‌య‌వ దానం చేయండి... ప్రాణాల‌ను కాపాడండి' అనే థీమ్‌తో ఈ మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌
  • అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్న‌ట్లు జై షా ప్ర‌క‌ట‌న‌

ఇంగ్లండ్ తో మూడు వ‌న్డేల సిరీస్ లో భాగంగా ఆఖ‌రిదైన మూడో వ‌న్డే బుధ‌వారం నాడు అహ్మదాబాలోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ మ్యాచ్ ను ఓ ఇంట్రెస్టింగ్ థీమ్‌తో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తాజాగా ఐసీసీ ఛైర్మ‌న్ జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

'అవ‌య‌వ దానం చేయండి... ప్రాణాల‌ను కాపాడండి' అనే థీమ్‌తో ఈ మ్యాచ్ ను నిర్వ‌హించ‌బోతున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మ్యాచ్ ద్వారా అవ‌య‌వదానాన్ని ప్రోత్స‌హించ‌డానికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించనున్న‌ట్లు జై షా పేర్కొన్నారు. అయితే, ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ఐసీసీ చేప‌డుతోందా లేక బీసీసీఐ నిర్వ‌హిస్తోందా అనే విష‌యాన్ని మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

"జ‌నాల‌కు స్ఫూర్తినిచ్చి వారిని ఏకం చేసే శ‌క్తి క్రీడ‌ల‌కు ఉంది. అందుకే దీని ద్వారా అవ‌య‌వ‌దానం విష‌య‌మై అవ‌గాహ‌న క‌ల్పించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని అనుకుంటున్నాం. ఈ ప్రపంచంలో మ‌నం ఇత‌రుల‌కు ఇచ్చే గొప్ప బ‌హుమ‌తి వారికి జీవితాన్ని ఇవ్వ‌డం మాత్ర‌మే. మ‌నం తీసుకునే ఒక మంచి నిర్ణ‌యం ఎన్నో ప్రాణాల‌ను కాపాడ‌గ‌ల‌దు. దీనికోసం అంద‌రం క‌లిసి ముంద‌డుగు వేద్దాం" అని జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపునిచ్చారు. 

ఇక భార‌త్‌, ఇంగ్లండ్ మూడు వ‌న్డేల సిరీస్ విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ రెండింటీలోనూ ఆతిథ్య భార‌తే విజేత‌గా నిలిచింది. దీంతో టీమిండియా 2-0తో సిరీస్‌ను కూడా కైవ‌సం చేసుకుంది. దాంతో ఎల్లుండి అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే మూడో వ‌న్డే నామమాత్రంగా మారింది. 

More Telugu News