Delhi polls: ఢిల్లీలో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీచేస్తే 67 చోట్ల డిపాజిట్ గల్లంతు!

Cong retains deposit in just 3 seats in Delhi polls

  • 1998 నుంచి పదిహేనేళ్ల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్
  • 2013 లో ఆమ్ ఆద్మీ పార్టీలో ఘోర పరాజయం
  • 2015 నుంచి ఎన్నికల్లో ఊసే లేకుండా పోయిన పార్టీ

గతంలో ఢిల్లీని పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా.. కేవలం ముగ్గురికి మాత్రమే డిపాజిట్ దక్కింది. ఏకంగా 67 మంది కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పార్టీ సీనియర్ షీలా దీక్షిత్ నేతృత్వంలో 1998 నుంచి మూడు టర్మ్ లు ఢిల్లీని కాంగ్రెస్ పార్టీ పాలించింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోయింది. కేవలం ఎనిమిది సీట్లకు పరిమితమైంది.

ఆ తర్వాత 2015 లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. 2020 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఖాతా తెరవలేదు. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఆ తర్వాత వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సున్నాకే పరిమితమైంది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత దీనస్థితికి చేరుకుంది. పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 

ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీపడగా.. 555 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 67 మంది ఉండడం గమనార్హం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా డిపాజిట్ దక్కించుకోవడం విశేషం. నియోజకవర్గంలో పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు దక్కించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ దీనస్థితిని వెల్లడిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News