Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి.. వైరల్ వీడియో!

- మధ్యప్రదేశ్ లోని విదిష జిల్లాలో ఘటన
- సోదరి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 23 ఏళ్ల యువతి మృతి
- ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్
మధ్యప్రదేశ్ లో ఓ 23 ఏళ్ల యువతి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. విదిష జిల్లాలోని ఒక రిసార్ట్‌లో వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తుండగా ఆమె ఇలా గుండెపోటుతో మరణించింది. ఈ షాకింగ్ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండోర్ వాసి పరిణిత జైన్ వరసకు సోదరి అయ్యే తన బంధువు వివాహ కార్యక్రమం కోసం విదిషకు వెళ్లింది. 200 మందికి పైగా అతిథులు హాజరైన 'హల్ది' ఫంక్షన్ సందర్భంగా పరిణిత వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలో పరిణిత బాలీవుడ్ పాట 'లెహ్రా కే బాల్కా కే' పాటపై డ్యాన్స్ చేస్తుండగా, ఆమె ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోవడం వీడియోలో చూడొచ్చు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక కిందపడ్డ వెంటనే అక్కడ ఉన్నవారిలో కొందరు పరిణితకు సీపీఆర్ చేసినా ఆమె స్పందించలేదు. దాంతో హూటాహూటిన ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిణితను పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
కాగా, ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన పరిణిత తన తల్లిదండ్రులతో కలిసి ఇండోర్‌లోని దక్షిణ తుకోగంజ్ లో నివసిస్తోంది. గతంలో ఆమె తమ్ముడు కూడా 12 ఏళ్ల వయసులో ఇలాగే గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. గుండెపోటుతో కొడుకు, కూతురుని కోల్పోవడం వారి పేరెంట్స్ కు కడుపుకోతను మిగిల్చింది. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.