School Boy: స్కూలు నుంచి ఆలస్యంగా వచ్చాడని తండ్రి పిడిగుద్దులు.. కొడుకు మృతి

Boy dies after being beaten by father in Choutuppal

  • చౌటుప్పల్ లో చోటుచేసుకున్న దారుణం
  • కేసు నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు
  • చివరి నిమిషంలో వెళ్లి ఆపిన పోలీసులు

మద్యం మత్తులో ఓ తండ్రి విచక్షణ మరిచాడు.. కన్న కొడుకును తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఆ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడి ఊపిరి ఆగిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే తండ్రి జైలుపాలవుతాడనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో పోలీసులు శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలను అడ్డుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్‌.. అతనికి భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో కుమారుడు భానుప్రసాద్‌ (14) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూలులో పదో తరగతి విద్యార్థులకు సెండఫ్ పార్టీ నిర్వహించారు. దీంతో భానుప్రసాద్ ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటికి వచ్చిన సైదులు కొడుకు ఇంకా ఇంటికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భానుప్రసాద్ ఇంటికి వెళ్లగానే స్కూలు నుంచి ఇప్పుడా ఇంటికి రావడమంటూ కొట్టడం మొదలు పెట్టాడు. మద్యం మత్తులో విచక్షణ మరచి ఛాతీ, ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

కొడుకు ఉలుకుపలుకు లేకుండా పడిపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. కొడుకుని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే భానుప్రసాద్ చనిపోయాడని వైద్యలు ప్రకటించారు. సైదులు కొట్టడం వల్లే భానుప్రసాద్ చనిపోయాడని తెలిస్తే పోలీసులు సైదులును అరెస్టు చేస్తారని భావించి గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం భానుప్రసాద్ మృతదేహాన్ని శ్మశానానికి తరలించి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి అడ్డుకున్నారు. సైదులును అదుపులోకి తీసుకుని, బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భానుప్రసాద్ తల్లి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News