V K Saxena: రాజీనామా లేఖ ఇచ్చిన అతిశీతో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

- యమునా నది శాపమే మిమ్మల్ని ఓడించిందన్న గవర్నర్ సక్సేనా
- కేజ్రీవాల్ ను హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శ
- ఎన్జీటీ కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చిన కేజ్రీవాల్ సర్కారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో అతిశీతో సక్సేనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణం యమునా నది శాపమేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేజ్రీవాల్ ను కూడా హెచ్చరించానని, అయితే, ఆయన పట్టించుకోలేదని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలకు అతిశీ స్పందించలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు గవర్నర్ సక్సేనా నిరాకరించారు.
అసలు ఏం జరిగిందంటే..
ఢిల్లీ ప్రజలకు తాగునీరందించే యమునా నదిలో కాలుష్యం స్థాయులు తీవ్రంగా పెరిగిపోయాయని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపి, నదిని పునరుద్ధరించే చర్యలను సిఫారసు చేసేందుకు గవర్నర్ నేతృత్వంలో ఓ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. 2023లో ఈ కమిటీ యమునా నది కాలుష్యంపై విచారణ చేపట్టగా కమిటీకి పూర్తి సహకారం అందిస్తామని అప్పటి సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే, అదే సమయంలో ఢిల్లీ సర్కారు ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కమిటీ ఏర్పాటు సరిగా లేదని, కమిటీకి సంబంధిత రంగానికి చెందిన నిపుణుడు సారథ్యం వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీపై స్టే విధించింది. రెండేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో యమునా నదిని కాలుష్యరహితంగా చేసే పని మొదట్లోనే ఆగిపోయింది. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ఎల్జీ వీకే సక్సేనాకు, ఆప్ ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. ఆప్ సర్కారుకు యమునా నది శాపం తగులుతుందని ఎల్జీ పదే పదే హెచ్చరించారు.