Kadiyam Srihari: బీఆర్ఎస్ తో స్నేహం చేయడమే ఆప్ ఓటమికి కారణం: కడియం శ్రీహరి

- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
- ఢిల్లీలో ఆప్... కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేదని వెల్లడి
- పార్టీ పిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని స్పష్టీకరణ
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లాంటి పార్టీతో స్నేహం చేయడం వల్లే ఢిల్లీలో ఆప్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఆప్... కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేదని అన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ఎప్పుడో కోల్పోయిందని, ఆ పార్టీ నేతలు ఓసారి గతంలోకి చూసుకుంటే బాగుంటుందని కడియం శ్రీహరి హితవు పలికారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులను చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. అప్పుడుఫిరాయింపులు ప్రోత్సహించి, ఇప్పుడు శుద్ధపూసల్లా మాట్లాడితే సరిపోతుందా? అని విమర్శించారు. మీరు చేస్తే సంసారం... మరొకరు చేస్తే వ్యభిచారమా? అని నిలదీశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉందని... దీనిపై ఎలాంటి తీర్పు వచ్చిన పాటిస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వస్తే ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు.