Hamas: హమాస్ చెర నుంచి విడుదలైన బాధితుడికి గుండె పగిలే వార్త.. కంటతడి పెట్టిస్తున్న బాధితుడి పరిస్థితి

- ఎట్టకేలకు భార్యా పిల్లలను కలుసుకోబోతున్నానని సంతోషంతో ఇంటికి చేరుకున్న వైనం
- కుటుంబం మొత్తం చనిపోయిందని తెలిసి కుప్పకూలిన బాధితుడు
- తనను బంధించిన రోజే తన భార్యాపిల్లలను చంపేశారని తెలియడంతో కన్నీరుమున్నీరైన ఇజ్రాయెల్ పౌరుడు
ఉగ్రవాదుల చెరలో చిక్కిన తర్వాత ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 491 రోజులు దినదిన గండంగా కాలం గడిపాడు. చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలా ఫీలవుతున్నావంటూ హమాస్ మిలిటెంట్లు అడగగా.. ఎట్టకేలకు భార్యాబిడ్డలను కలుసుకోబోతున్నానని సంతోషం వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది. కానీ, ప్రాణాలు దక్కాయని సంతోషించే లోపే విషాదం పలకరించింది. తనను బంధించిన రోజే తన భార్యా పిల్లలను హమాస్ మిలిటెంట్లు చంపేశారని తెలియడంతో ఆ బాధితుడు గుండెలవిసేలా రోధించాడు. ఇన్ని రోజుల ఎదురుచూపు ఇలా విషాదంగా ముగిసిందని చూపరులు కూడా కంటతడి పెట్టారు. ఇజ్రాయెల్ లో శనివారం ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో జరుగుతున్న ఓ పార్టీపై దాడి చేసిన విషయం తెలిసిందే. కాల్పులు జరుపుతూ, బాంబులు విసురుతూ మారణహోమం సృష్టించారు. వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్న వారిని వెంటాడి పట్టుకున్న మిలిటెంట్లు.. దాదాపు 200 మందిని బంధీలుగా గాజాకు తరలించారు. ఇందులో ఇజ్రాయెల్ లోని కిబుట్జ్ కు చెందిన ఎలి షరాబీ ఒకరు. మిలిటెంట్ల చెరలో ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ సుదీర్ఘ కాలం గడిపిన తర్వాత శనివారం ఎలి షరాబీ విడుదలయ్యారు.
శనివారం విడుదల చేసిన ముగ్గురు బంధీలలో షరాబీ ఒకరు.. తిరిగి ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన షరాబీ మీడియాతో మాట్లాడుతూ ఎట్టకేలకు భార్యాబిడ్డలను కలుసుకోబోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, ఇంటి దగ్గర అతడి కోసం ఓ దుర్వార్త ఎదురుచూస్తోందని షరాబీ ఊహించలేకపోయాడు. 491 రోజుల తర్వాత కిబుట్జ్ చేరుకున్న షరాబీని చూసి సంతోషం వ్యక్తం చేయాల్సిన గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర భార్యాపిల్లలు స్వాగతం పలుకుతారని భావించిన షరాబీ.. అక్టోబర్ 7న జరిగిన మారణహోమంలో భార్యాపిల్లలను పోగొట్టుకున్నానని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. షరాబీ భార్య లియాన్నే, కూతుళ్లు నోయా (16), యాహెల్ (13) ముగ్గురూ హమాస్ మిలిటెంట్ల కాల్పుల్లో మరణించారు.