Atishi Marlena: ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా

- ఎల్జీకి రాజీనామా లేఖ అందజేసిన ఆప్ నేత
- అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో రిజైన్
- కల్కాజీ నుంచి గెలుపొందిన అతిశీ
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత అతిశీ మార్లేనా రాజీనామా చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నేపథ్యంలో అతిశీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా అతిశీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమి పాలైనప్పటికీ బీజేపీ అక్రమాలు, అవినీతిపై తాము చేస్తున్న పోరాటం మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు. పార్టీలో కీలక నేతలు ఓడిపోవడం విచారకరమని అన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన కల్కాజీ ఓటర్లకు అతిశీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుపాలైనప్పటికీ సీఎం పదవిని అంటిపెట్టుకుని ఉన్న కేజ్రీవాల్.. బెయిల్ పై బయటకు వచ్చాక రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత అతిశీని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. అనూహ్యంగా దక్కిన సీఎం పదవిలో బాధ్యతగా పనిచేస్తూనే ఎన్నికల తర్వాత మళ్లీ కేజ్రీవాలే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అతిశీ చెబుతూ వచ్చారు. అయితే, తాజా ఎన్నికల్లో కేజ్రీవాల్ సహా పార్టీ కీలక నేతలు ఓటమి పాలవడంతో అతిశీ తన పదవికి రాజీనామా చేశారు.