Mexico: ట్రక్ ను ఢీ కొట్టి మంటల్లో చిక్కుకున్న బస్సు.. మెక్సికోలో 41 మంది సజీవ దహనం

--
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ తో పాటు బస్సులోని ప్రయాణికులు మొత్తం 41 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో డ్రైవర్ సహా బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఎనిమిది మంది మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో జరిగిందీ ఘోర ప్రమాదం. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ టీమ్.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించింది. బస్సులో 18 మంది ప్రయాణికులకు సంబంధించిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.