Elon Musk: టిక్ టాక్ కొనుగోలు అంశంపై మస్క్ రియాక్షన్ ఇలా..

- టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఆలోచన లేదన్న ఎలాన్ మస్క్
- తనకు కంపెనీలను కొనుగోలు చేయడంకంటే నెలకొల్పడం అంటేనే ఎక్కువ ఇష్టమన్న మస్క్
- 2017లోనే టిక్‌టాక్‌పై నిషేధం విధించిన భారత్ సహా పలు దేశాలు
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే యోచన తనకు లేదని ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. అమెరికాలో నిషేధం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు అమెరికాలోని టిక్‌టాక్ కార్యకలాపాలను ఎలాన్ మస్క్‌కు విక్రయించాలని సంస్థ యాజమాన్యం యోచిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై మస్క్ స్పందించారు.
గత నెలలో ఒక వీడియోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించగా, జర్మనీకి చెందిన ఓ వార్తా సంస్థ దాన్ని తాజాగా బయటపెట్టింది. తాను టిక్‌టాక్ కోసం బిడ్డింగ్ వేయలేదని, దాన్ని కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదని మస్క్ తెలియజేశారు. తనకు కంపెనీలను కొనుగోలు చేయడం కంటే నెలకొల్పడం అంటేనే ఎక్కువ ఇష్టమని మస్క్ ఈ సందర్భంగా అన్నారు.
టిక్‌టాక్‌ను 2017లో భారత్ సహా పలు దేశాలు నిషేధించిన విషయం విదితమే. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా దీని వినియోగంపై ఆంక్షలు విధించారు. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనని అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల తీర్మానించింది. అనంతరం టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు అమెరికా సుప్రీం కోర్టు కూడా డెడ్‌లైన్ విధించింది.
సంస్థ జాయింట్ వెంచర్‌లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే దానికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ పలు మార్లు పేర్కొనడమే కాక అధికారంలోకి వచ్చిన తర్వాత 75 రోజుల్లోగా టిక్‌టాక్‌ను అమ్మివేయాలంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కూడా సంతకం చేశారు. దీంతో ఆయన సన్నిహితుడైన మస్క్‌కు దీన్ని విక్రయించాలని సంస్థ యాజమాన్యం ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి.