grooms cibil score: సిబిల్ స్కోరు ఎంత పని చేసింది...!

- సిబిల్ స్కోర్ ఆధారంతో వివాహాన్ని రద్దు చేసిన వధువు కుటుంబ సభ్యులు
- మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో ఘటన
- సోషల్ మీడియాలో వైరంగా మారిన వైనం
పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి ఇవ్వాలనే వారు. ఆ తర్వాత వరుడికి ధూమపానం, మద్యపానం, జూదం (పేకాట) వంటి ఇతరత్రా చెడు అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ప్రస్తుతం సమాజంలో ఈ లక్షణాలు అన్నీ సాధారణ విషయాలుగా మారిపోయాయి. ప్రస్తుతం మాత్రం అమ్మాయి తల్లిదండ్రులు వరుడు ఏమి చదువుకున్నాడు, ఆస్తిపాస్తులు, ప్యాకేజీ ఎంత తదితర విషయాలను తెలుసుకుని సంబంధాన్ని ఖాయం చేసుకుంటున్నారు.
అయితే ఇటీవల ఓ వరుడి సిబిల్ స్కోర్ ఆధారంగా వివాహం రద్దు చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. ప్రస్తుతం ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలంటే అతని సిబిల్ స్కోర్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఓ యువకుడి సిబిల్ స్కోర్ సరిగా లేదని వధువు తాలూకు వ్యక్తులు వివాహం రద్దు చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం .. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి సంబంధం ఖాయమైంది. వివాహానికి కావాల్సిన అన్ని విషయాలను మాట్లాడుకుని మూహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు. అయితే వివాహానికి కొన్నిరోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేశాడు.
అందులో వరుడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు, సిబిల్ స్కోర్ కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రత ఎలా కల్పిస్తాడని ప్రశ్నించిన వారు వివాహం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. వధువు కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.