Telangana: తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారు: టీపీసీసీ చీఫ్

- ఢిల్లీ ఎన్నికలను తెలంగాణ ఎన్నికలతో పోల్చడం విడ్డూరమన్న మహేశ్ కుమార్ గౌడ్
- తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని వ్యాఖ్య
- కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమన్న టీపీసీసీ చీఫ్
తెలంగాణలో అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు కలలు కంటున్నారని, కానీ అవి పగటి కలలేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తూ, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
ఢిల్లీ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను చూసి బీజేపీ నాయకులు ఆనందిస్తున్నారని, కానీ మన రాష్ట్రంలో ఎప్పటికీ గెలవలేరన్నారు. ఢిల్లీ ఎన్నికలను పోల్చుతూ ఇక్కడి బీజేపీ నేతలు ఆనందపడటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణమన్నారు.